ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 11:26 am Posted by : ARJUN SAMAACHAARAM DESK

భారత్ కు జిన్ పింగ్

న్యూఢిల్లీ, ఆగస్టు1,అర్జున్ సమాచారం:
2020లో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత భారత్‌–చైనా సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లపాటు భారత ప్రధాని నరేంద్రమోదీ చైనాకు వెళ్లలేదు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్‌ను సందర్శించలేదు. ఇటీవలే భారత్‌–చైనా సంబంధాలు మళ్లీ పునరుద్ధరణ జరిగింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ కొన్ని నెలల క్రితం చైనా పర్యటనకు వెళ్లారు. ఇక ఇప్పుడు సెప్టెంబర్‌ 12–13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్‌ సమ్మిట్‌కు జిన్‌పింగ్‌ హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను మరింత తగ్గించి, కొత్త సంబంధాల పునాది వేసే అవకాశంగా ఉంది.గల్వాన్‌ ఘర్షణ తర్వాత సరిహద్దు ఉద్రిక్తతలు, సైనిక ఘర్షణలు, వాణిజ్య పరిమితులు వంటివి రెండు దేశాల సంబంధాలను దెబ్బతీశాయి. 2019లో మామల్లపురంలో జరిగిన అనధికారిక సమ్మిట్‌ తర్వాత జిన్‌పింగ్‌ భారత్‌కు రాలేదు. అయితే ఇటీవలి కాలంలో ఇరు దేశాల సంబంధాల్లో కొంత మెరుగుదల కనిపిస్తోంది. 2024లో కజాన్‌లోనూ, 2025లో తియాన్‌జిన్‌లోనూ ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ కలుసుకున్నారు. సరిహద్దు విషయంలో కొన్ని అవగాహనలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్‌ రాక భారత్‌–చైనా సంబంధాల్లో మరో ముఖ్యమైన మలుపుగా మారే అవకాశం ఉంది.భారత్‌ బ్రిక్స్‌కు అధ్యక్షత వహిస్తున్న సందర్భంలో జరుగుతున్న ఈ సమ్మిట్‌ ప్రపంచ రాజకీయాల్లో కూడా ముఖ్యమైనది. రష్యా, ఇరాన్‌ వంటి దేశాల నాయకులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. పశ్చిమాసియా సంక్షోభం, గ్లోబల్‌ సౌత్‌ సమస్యలు, ఆర్థిక సహకారం వంటి అంశాలు చర్చల్లో ఉంటాయి. జిన్‌పింగ్‌ హాజరైతే ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలకు కూడా అవకాశం ఏర్పడుతుంది. సరిహద్దు సమస్యలు, వాణిజ్య అసమతుల్యత, పెట్టుబడులు వంటి అంశాలపై చర్చ జరగవచ్చు.ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య నమ్మకం పెరిగే అవకాశం ఉంది. వాణిజ్య సంబంధాలు మెరుగుపడటం, సరిహద్దు ఉద్రిక్తతలు మరింత తగ్గడం, బహుపక్ష వేదికల్లో సహకారం పెరగడం వంటి ఫలితాలు రావచ్చు. అయితే సరిహద్దు విషయంలో ఇంకా పూర్తి పరిష్కారం లేకపోవడం, పరస్పర అపనమ్మకం, ప్రాంతీయ రాజకీయాలు వంటివి సవాళ్లుగా ఉంటాయి. అయితే జిన్‌పింగ్‌ పర్యటనపై– అధికారిక ప్రకటన ఇంకా రాలేదుగల్వాన్‌ ఘటన తర్వాత తొలిసారి జిన్‌పింగ్‌ భారత్‌కు రావడం రెండు పెద్ద ఆసియా శక్తుల మధ్య సంబంధాలను కొత్త దిశలో నడిపించే అవకాశం ఉంది. బ్రిక్స్‌ వేదిక దీనికి అనుకూల వాతావరణం కల్పిస్తుంది. అయితే నిజమైన పురోగతి సరిహద్దు, వాణిజ్య సమస్యలపై కాంక్రీట్‌ చర్యలపైనే ఆధారపడి ఉంటుంది.
=================